ఒకే ఒక మాట... ‘గురు’ సమీక్ష
ఒకే ఒక మాట...
ఈ కింది పేరాగ్రాఫుల పొడవును కళ్లతో కొలిచేసి అబ్బే.. ఏం చదువుతాంలే అనుకునే తత్వం మీదై, మీరు మూవీ లవర్ అయితే వెంటనే ‘గురు’ సినిమాకు వెళ్లిపొండి.
అలాకాక సినిమా చూసే ముందు దాని గురించి బోలెడంత సమాచారం సేకరించి బాగోగులు తూచి ఆ తరవాత మాత్రమే వెళ్లేవాళ్లయినా సరే..
నన్ను నమ్మి గురు సినిమాకు వెళ్లొచ్చిన తరువాత ఇది చదవండి.
నిజానికి అప్పుడు మీరు చదవక పోయినా నేను బాధ పడను.
జస్ట్ బికాజ్ ఒక చిన్న సినిమా బాగుంటే నాకు పట్టలేనంత సంబరం.
ఆ బాగున్న చిన్న సినిమా బాక్సాఫీస్ ను బద్దలు చేస్తే నాకు యమ యమ యమానందం.
వెంకటేష్ నటించిన సినిమా చిన్న సినిమా ఎలా అనే అనుమానం రావచ్చు.
కానీ వంద కోట్ల, వేల స్క్రీనింగ్ ల సినిమాలతో పోలిస్తే ఇది నిజంగా చిన్న సినిమానే.
విదేశీ బాక్ గ్రౌండ్స్, గ్రాఫిక్ మాయామర్మాలూ తదితర చెత్తా చెదారాలేమీ లేవు. ఉన్నదల్లా కఠిన వాస్తవాలూ, మనలో భాగమైన పాత్రలూ, మనం ‘కల’గనే నిజాయితీలూ, మనం కార్చలేని కన్నీళ్లూ, మనం లోలోపలే కుక్కేసిన ఆవేశకావేశాలూ అన్నింటినీ మించిన చించేసిన పెర్ ఫార్మెన్స్ లూ...అంతే.
000 000 000
ఆటలంటే గెలుపు ఓటములు మాత్రమే కాదు.
బోలెడన్ని భావోద్వేగాలు. లెక్కలేనన్ని ఈర్ష్యాద్వేషాలు. అంతుచిక్కని ఎత్తుగడలు.జాతీయ జట్ల ఎంపికలూ, పతకాలూ, దేశానికి ప్రాతినిధ్యం వహించడాలూ, అకాడమీలూ, ఉద్యోగాల కోసం వెంపర్లాడే అమ్మాయిలూ ఆ వెంపర్లాటను తమ వాంఛలకు అనుగుణంగా మలచుకునే కోచ్ లూ.. వీటన్నింటి చుట్టూ పేరుకున్న రాజకీయాలూ అన్నీ కలిస్తే ఇంకేం.... కళ్లకు కట్టేది ఆటలంటే ఆటలు కాదనే ఒక పచ్చి జీవన వాస్తవ చిత్రం.
ఒక సినిమా కథకు ఇంతకంటే మసాలా ఇంకేం కావాలి.
అందుకే భారత దేశంలోని ఏ భాషలోనైనా క్రీడలకు సంబంధించిన కథాంశంతో వచ్చిన సినిమాలలో ఫ్లాప్ లైనవి ఒకటో రెండో. అంతే.
ఈ హిట్ ఫార్ములాను నమ్ముకుని తాజాగా క్రీడాకారుల జీవితాలలోని ఎగుడు దిగుళ్లను ఇతివృత్తాలు చేసుకుని వస్తున్న సినిమాల సంఖ్య కూడా పెరిగింది. మేరీకోం, దంగల్, అలాంటివే. లగాన్, అవ్వల్ నెంబర్, చక్ దే ఇండియా, సుల్తాన్ కూడా ఆ కోవలోవే. అన్నీ సొమ్ము చేసుకున్నాయి.
అదేంటోగానీ తెలుగులో ఫుల్ లెంగ్త్ స్పోర్ట్స్ మూవీలను లెక్కబెట్టాలంటే వేళ్లే కాదుకదా చేతులే మిగిలి పోతాయి.
కబడ్డీ కబడ్డీ, సై, గోల్కోండ హైస్కూల్ వంటి సినిమాలు కేవలం క్రీడలను కథలో భాగం చేసుకున్నవి మాత్రమే.
నాకు గుర్తున్నంత వరకూ చాలా కాలం క్రితం ‘అశ్వని’ అని ఓ సినిమా వచ్చింది.
మన స్ప్రింటర్ అశ్వనీ నాచప్ప ఆ సినిమా హీరోయిన్. నాచప్ప అందగత్తె కూడా కావడంతో ఆ సినిమాకు అదనపు ఆకర్షణ అయింది.
అయితే అది పూర్తిగా ఆమె జీవిత చరిత్ర కాదు.
ఇందులో హీరోయిన్ కడు నిరుపేద. పరిగెత్తడంలో ఆమె శక్తిని గుర్తించిన కోచ్ (భానుచందర్) ఆమెను అంతర్జాతీయ స్ప్రింటర్ గా మలుస్తాడు.
సరే ఇప్పుడిదంతా ఎందుకంటే ‘గురు’ అనే ఓ మంచి సినిమా గురించి మాట్లాడే ముందు కొంత ఉపోధ్ఘాతం అవసరం కనుక.
‘గురు’ ఓ బాక్సింగ్ కోచ్ కథ.
బాక్సర్గా రాజకీయాలకు బలై స్వర్ణ పతకానికి దూరమై కోచ్ గా మిగిలి పోయి తన జీవితంలోని వైఫల్యాల క్రీనీడలను అడుగడుగునా వెళ్లకక్కుతూ నీఛ నికృష్ఠ అకాడమీ సిస్టమ్ మీద కసిని వెళ్లకక్కే కొరుకుడు పడని మొండి మనిషి కథ.
తన కంటే ఓ మొండిఘటమైన అమ్మాయిలో బాక్సింగ్ స్కిల్ ఉందని గ్రహించి ఆమెను గోల్డ్ మెడల్ స్దాయికి తీసుకెళ్లే దారిలో జరిగే దుర్మార్గాల, నైచ్యాల, కన్నీళ్లూ, కుట్రల, అమ్మకాలూ కొనుగోళ్ల మంచీ చెడుల సమాహారం కథ.
‘గురు’ డైరెక్టర్ ఓ మహిళ అని కుప్పలు తెప్పలు ఆశ్చర్యం ప్రకటించేయడం నాకిష్టం లేదు. షి కెన్. ‘గురు’ హింది వెర్షన్ 'సాలా కడూస్' తమిళ వెర్సన్ 'ఇరుదు సత్రు'కు కూడా ఆమే దర్శకురాలు.
హిందిలో మాధవన్ చేసిన పాత్రను తెలుగులో వెంకటేష్ చేసాడు. హిందిలో మాధవన్ చాలా బాగా చేసాడనిపించింది.
వెంకటేష్ ను చూసిన తరువాత మాధవన్ ను మింగేసాడనిపించింది.
హిందీ తమిళ వెర్షన్లలో నటించిన రితికా సింగే తెలుగులోనూ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాలే ఆ అమ్మాయి మొదటి సినిమాలు. కానీ ఎన్నో సినిమాలు చేసిన వెంకటేష్ ఎదుట నిలబడి ధీటైన పర్ఫార్మెన్స్ ప్రదర్శించింది.
రెండు పాత్రలను ఈ ఇద్దరూ పోటాపోటీగా పండించారు.
రితికా మొండితనాన్నీ, రౌడీయిజాన్నీ, కుటుంబం పట్లా అక్క పట్లా బాధ్యతనూ ప్రేమనూ ద్వేషాన్నీగొప్పగా పలికించింది.
సినిమా హాల్లోంచి బయటకు వచ్చే ప్రేక్ణకుడిని రితికా సింగ్ వెంటాడుతూనే ఉంటుంది. ఖాయంగా తీయని గాయంగా.
క్లయిమాక్స్ కొంత దంగల్ లా ఉంది. అందుకు నిందించేదేమీ లేదు. దంగల్ కంటే సాలా కడూసే ముందు విడుదలైంది. అది 2016 జనవరిలో విడుదలైతే దంగల్ డిసెంబర్ లో విడుదలైంది.
రెండు భాషలలో కొంచెం అటూ ఇటూగా నడిచినా మళ్లీ అదే కథను తెలుగులో తెరకెక్కించిన సుధా కొంగర ధైర్యానికి కుడోస్. ‘సాలా కడూస్’ పెద్దగా నడవలేదు. మంచి రివ్యూలొచ్చాయి. తమిళంలో ‘ఇరిదు సత్రు’ కూడా అంతే.. మంచి రివ్యూలొచ్చాయి కానీ ఓ మోస్తరుగా ఆడింది.
తెలుగులో కూడా ‘గురు’కు మంచి రివ్యూలొస్తే అదే జరుగుతుందేమోనని భయపడుతూనే సినిమా బాగాలేదు అని రాసే మనసొప్పక..
.
.
లాంగ్ లీవ్ చిన్న సినిమా.
.....

- ప్రసేన్.
  Advertisement
 
Latest News
నేడు ‘నాని’ పుట్టినరోజు - khammamtv.com
----------------------------------------------------------------------------------------------------
ప్రముఖ బాలీవుడ్‌ నటుడు వినోద్‌ ఖన్నా ఇకలేరు
----------------------------------------------------------------------------------------------------
నా కడుపు నిండలేదు, ఖరీదైన కారు కూడా లేదు: కీరవాణి
----------------------------------------------------------------------------------------------------
శ్రీను వైట్ల తన ఎలిజీ తనే రాసేసుకున్నాడు (‘మిస్టర్’ రివ్యూ)
----------------------------------------------------------------------------------------------------
స్పైడర్ స్పెల్లింగ్ spider (అర్దం సాలెపురుగు)
----------------------------------------------------------------------------------------------------
ఒకే ఒక మాట... ‘గురు’ సమీక్ష
----------------------------------------------------------------------------------------------------
కుమార్తె తొలి ఫొటోను షేర్‌ చేసిన హీరో 
----------------------------------------------------------------------------------------------------
రజితోత్సవం
----------------------------------------------------------------------------------------------------
ఇండియా లో స్టీరింగ్ కుడివైపు, ఇతర దేశాల్లో ఎడమవైపు ఎందుకుంటుందో తెలుసా?
----------------------------------------------------------------------------------------------------
గణ తంత్రం
----------------------------------------------------------------------------------------------------
More..