దాన్ని spyder అని రాసారంటే అర్దం వేరే అయినా అయి ఉండాలి. లేదా ఏదో శ్లేషను జొప్పించయినా ఉండాలి. కానీ, మహేష్ బాబు కొత్త సినిమా ఫస్ట్ లుక్ లో సినిమా పేరును spyder అనే రాసారు. Spyder అనే మాటకు వేరే అర్దం ఏదీ లేదని నిఘంటువు చెపుతోంది.
సరే, spy అనే పదానికి గూఢచారి అనే అర్దం ఉంది కనుక ఈ సినిమా గూఢచర్యం ఇతివృత్తం అయి ఉండవచ్చు కనుక ఇలా స్పెల్లింగ్ మార్చి శ్లేషించారు కామోసులే అనుకుందామంటే spyder లో spy కి ‘కోట్స్’ పెట్టాలి. అసహ్యంగా సినిమా టైటిల్లో కోట్స్ ఏంటి అని అభ్యంతరిస్తే కనీసం ఈ విషయం వివరణైనా ఇవ్వాలి.
లేదూ ఓ టాగ్ లైన్ పెట్టుకునే వెసులుబాటెలాగూ ఉంది.
సరే, ఇంతోటి మహేష్ అభిమానులకో తెలుగు సినిమా చూపరులకో spyder కి spider కి తేడా తెలుస్తుందిలే అని గమ్మునుంటే మాత్రం చూపరులను చిన్న చూపు చూసినట్టే.
ఆంగ్ల భాషలో ఓ చిన్న మెలిక ఉంది. కొన్ని పదాలకు రెండేసి స్పెల్లింగులున్నాయి. ఒకటి బ్రిటన్ ఇంగ్లీషనీ ఇంకొకటి అమెరికన్ ఇంగ్లీషనీ... కానీ, స్పయిడర్ కు అలా ద్వయితం లేదు.
ఇవేవీ కాక ఇంకేదో ఉండి ఉంటే అదేంటో సెలవిస్తే ఉభయ కుశలోపరి.
అలా కాక ఇదంతా తప్పయితే, ఒప్పేంటో విప్పి చెపితే ఈ సందేహాన్ని నేను ఉపసంహరించుకున్నట్టేనోచ్...
ఇంత.... అవసరమా అని కూడా అనొచ్చు...
నేములోనేముంది అంటారు కానీ
నేములోనె అంతా ఉందిటండోయ్.
ప్రసేన్, ప్రముఖ చిత్ర సమీక్షకులు. |