శ్రీను వైట్ల తన ఎలిజీ తనే రాసేసుకున్నాడు (‘మిస్టర్’ రివ్యూ)
దాని పేరు మిస్టర్. ఉరఫ్ ఇంకో డిజాస్టర్.. మారాను., మారతాను అని అనే వాళ్లను అస్సలు నమ్మకూడదు.. శ్రీను వైట్ల కూడా అంతే.. మొన్న ‘దూకుడు’, నిన్న ‘ఆగడు’, ఇప్పుడిక ‘మారడు’.. ‘ఆనందం’ సినిమా రోజుల్లో ‘శ్రీను వైట్ల’ బాగానే ఉన్నాడు. ‘ఢీ’ సినిమా హిట్ అయి శ్రీను వైట్లను ధ్వంసం చేసింది. ‘రెడీ’ కూడా ఓ మోస్తరుగా నడవడం అదే ఫార్ములాతో ‘దూకుడు’ కూడా సొమ్ము చేయడం ఇక వైట్లకు కొబ్బరికాయ దొరికినట్టయింది. ఆ ఫార్ములానే తిరగేసి మరగేసి ‘ఆగడు’ వదిలాడు. దిమ్మ తిరిగి డిజాస్టర్ కనపడింది. అయినా, ఆ కొబ్బరికాయ పైత్యం వదలలేదు. నిజానికి ఆ పైత్యం వదిలించు కోవాలన్న తెలివిడి మాత్రం వచ్చినట్టే కనపడింది. కానీ, ‘మిస్టర్’లో మళ్లీ మళ్లీ అదే జీళ్ల పాకం.
సినిమా వ్యాఖ్యానంలో ముందుగా కథ చెప్పడం ఆనవాయితీ కనుక చెప్పే ప్రయత్నం చేస్తాను.
నేను కథ చెప్పలేకపోతేనో నేను చెప్పే కథ మీకు అర్దం కాకపోతేనో ఆ తప్పు నాది కాదు.
ఓ అమ్మాయి ఒకతన్ని ప్రేమించి, మరొకతనికి కూడా తనను ప్రేమిస్తుందేమో అనే అనుమానం కలిగేంత బలంగా ప్రవర్తించి, చివరాఖరుకు ‘నేను నిన్ను ప్రేమించడం లేదు’ అని చెప్పి, తన ప్రేమ సఫలం కావడానికి, తను ప్రేమించని వాడి సాయమే కోరి చివరకు అతన్నే ప్రేమించి, పెళ్లికి సిద్ద పడి మరో చివరాఖరుకు ఆ ప్రేమికుడే ఇలా కాదు నువు మొదట ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకో అని చెప్పేస్తే సరే అని తలూపి తెరదించే హెబ్బా కథే మిస్టర్. ఇది మిస్టరీ కదా అని అడక్కండేం.
అమ్మతోడు అక్షరం ముక్క కూడా అర్దం కాలేదు కదూ..
సరే ఇంకో పాత్ర వైపునుంచి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ కూడా నా వైఫల్యం ఉంటే అది నాది కానే కాదు సుమా.
ఓ కుర్రాడు విదేశంలో ఎదురైన కుర్రదానికి మనసు పారేసుకుని అదే కుర్రది మరో వెర్రోడిని ప్రేమిస్తోందని ఎరిగి, త్యాగి పాత్రలో దూరి ఆ కుర్ర వెర్రి ప్రేమను గెలిపించుటకై స్వదేశానికి వచ్చి తత్ మార్గంలో ఎదురొచ్చిన మరో అమ్మడికి షిఫ్ట్ అయిపోయినట్టుగానే కనపడుతూ "తొలి ప్రేమ జ్వాల" వంటి రొడ్డకొట్టుడు చిలక పలుకులు వల్లిస్తూ, తనను పెళ్లి చేసుకోవడానికి సిద్ద పడ్డ మొదటి కుర్రదానికి క్లాస్ పీకి నువు నన్ను కాదు. నీ వెర్రోడినే చేసుకో. నేను నా షిఫ్ట్ రాణినే చేసుకుంటా అని కౌన్సిలింగ్ ఇచ్చేసి ‘మనం ప్రేమ కోసం వెతికితే మనల్నే ప్రేమ వెతుక్కుంటూ వస్తుంది’ అనే కొటేషన్ కోటేశ్వరరావు పాత్రలో చేరి, ‘మనం సినిమా కోసం వెళితే ‘మన’ను హింస వెతుక్కుంటూ వస్తుంది’ అని గొణుక్కునేట్టు చేసి తెర దించేస్తాడు.
ఊహూ.. ఏమీ అర్దం అయినట్టు లేదు కదూ. కథ చెపుతున్నట్టు నేను డ్రామాలాడుతున్నాను. కానీ, మదర్ ప్రామిస్ నాక్కూడా పెద్దగా అర్దం అయినట్టు లేదు.
ఇంతే కదా కథ అని సంబర పడిపోయేరు...
ఇంకా చాలా ఉంది. ఆ అమ్మడికో రౌడీ గ్యాంగ్, ఈ కుర్రదానికో గూండా బాచ్, ఇంకో ఫాక్ష్లన్ గ్రూప్, మరింకో కన్నడ సైన్యం, పోలీసులుగా మారే దొంగలు, డాక్టర్లుగా మారే రౌడీలు, క్రిస్టియన్ ఫాదర్లుగా మారే పోలీసులు, పనికి మాలిన ఊపిరి స్కూప్, అర్దం పర్దం లేని శ్రీమంతుడి స్టోరీ టెల్లింగ్, చికాకు పుట్టించే కన్నడ భాషా సన్నివేశాలూ, ఆయా పాత్రధారుల వేషాలూ. ఇవన్నీ వెరసీ రెండుమ్ముప్పావు గంటల అయోమయం. ఓ నిరంతరాయ చిరాకు.
తనకంటే గొప్పగా ప్రేమించే వ్యక్తికి చెల్లినివ్వాలని డైలాగులు వల్లించిన అన్నగారు. అసలు మొదట తన చెల్లి ప్రేమించిన వ్యక్తి, చెల్లిని ఎంత ప్రేమించాడో కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయడు. ఫస్ట్ లవ్ అంటే సినిమా అంతా ఊదర గొట్టే హీరో చివర్లో సెకండ్ లవ్ కే సెటిల్ అవుతాడు. ఫస్ట్ లవ్ కూ సెకండ్ లవ్ కూ నడుమ ఊగిసలాడే హీరోయిన్ ఎప్పుడెవరి వైపు మొగ్గు చూపుతుందో ఓ పజిలే. వాటే పాత్రౌచిత్యం. ఐటమ్ సాంగ్ ఎలా తీయకూడదో ఒక రిఫరెన్స్ మెటీరియల్ అందించాడు వైట్ల. రెండుమ్ముప్పావు గంటల సినిమాను కనీసం గంటా యాభై నిముషాలకు కుదించగలిగితే గానీ రావల్సిన పైసల్లో కొద్ది భాగమైనా వస్తాయి.
ఊపిరి స్కూప్ తీసేయాలి. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీని కోసి పడేయాలి. కన్నడ గోలను ఎడాపెడా కుదించేయాలి. ఓసోస్ ఇంకా చానా చానా తీసేయాలి.
నిజం చెప్పాలంటే తీసేయాల్సిన వాటి జాబితా కంటే ఉంచాల్సిన వాటి జాబితా చెప్పడం తేలిక.
శ్రీను వైట్లకు తెలిసి కూడా అతను మరిచి పోయిన రెండు విషయాలను గుర్తు చేయడం ఇక్కడ అవసరం.
సినిమాకు బ్రీవిటీ ముఖ్యం. అండ్ సినిమా అనేది దృశ్య ప్రధానం. పాత్రలన్నీ తెగ వాగేయడం వల్ల సినిమా బోర్ కొట్టడం అనేది ‘ఆగడు’లోనే రుజువైనా ‘వైట్ల’ పాఠం నేర్చుకోలేదు. ‘మిస్టర్’లో అనవసర సన్నివేశాలకు లెక్కలేదు. సినిమాను నాటకంగా, వాచకంగా మార్చి పరుచూరి బ్రదర్స్ హిట్ మీద హిట్ కొడితే కొట్టి ఉండొచ్చు కానీ అక్కడనుంచి సినిమాను దృశ్య ప్రధానంగా మార్చిన రాంగోపాల్ వర్మ అండ్ కో శిష్యగణం అప్డేషన్ ను వైట్ల మళ్లీ వెనక్కు తీసుకువెళ్లే ప్రయత్నం చేసి తనను తాను హరాకిరీ చేసుకుంటున్నాడు... కాదు కాదు చేసేసుకున్నాడు.
పెర్ఫార్మెన్స్ ల లో ఎవర్నీ నిందించేదేమీ లేదు.
అందరూ బాగా చేసారు. హీరో... ఇద్దరు హీరోయిన్లు ఇంకా చాలా చాలా మంది తప్పేమీ లేదు.
చేంతాడంత కథ, బుద్దెరుగని కన్ఫ్యూజన్, లెక్కకు చిక్కని పాత్రలు, విచిత్ర ఫాన్సీడ్రస్ వేషభాషలూ కలగలిసి ఈ దశాబ్దపు అత్యంత కంగాళీ సినిమా ఇది.
అంతా నువ్వే ...నువ్వే చేశావ్ శ్రీనూ. తప్పంతా నీదే..నీదే వైట్లా.
చివరిగా ఇంకోసారి...
శ్రీను వైట్ల తన ఎలిజీ తనే రాసేసుకున్నాడు.
. .....
- ప్రసేన్, ప్రముఖ చిత్ర సమీక్షులు.
  Advertisement
 
Latest News
నేడు ‘నాని’ పుట్టినరోజు - khammamtv.com
----------------------------------------------------------------------------------------------------
ప్రముఖ బాలీవుడ్‌ నటుడు వినోద్‌ ఖన్నా ఇకలేరు
----------------------------------------------------------------------------------------------------
నా కడుపు నిండలేదు, ఖరీదైన కారు కూడా లేదు: కీరవాణి
----------------------------------------------------------------------------------------------------
శ్రీను వైట్ల తన ఎలిజీ తనే రాసేసుకున్నాడు (‘మిస్టర్’ రివ్యూ)
----------------------------------------------------------------------------------------------------
స్పైడర్ స్పెల్లింగ్ spider (అర్దం సాలెపురుగు)
----------------------------------------------------------------------------------------------------
ఒకే ఒక మాట... ‘గురు’ సమీక్ష
----------------------------------------------------------------------------------------------------
కుమార్తె తొలి ఫొటోను షేర్‌ చేసిన హీరో 
----------------------------------------------------------------------------------------------------
రజితోత్సవం
----------------------------------------------------------------------------------------------------
ఇండియా లో స్టీరింగ్ కుడివైపు, ఇతర దేశాల్లో ఎడమవైపు ఎందుకుంటుందో తెలుసా?
----------------------------------------------------------------------------------------------------
గణ తంత్రం
----------------------------------------------------------------------------------------------------
More..