ప్రాణం వాసన రమాదేవి బాలబోయిన కవితా సంపుటి - khammamtv.com
....................................................................................................
కొన్ని భావాలనూ, అనుభవాలను స్త్రీ స్వయంగా వ్యక్తపరుచుకోగలిగితే, వాటిలోని ఆధ్రత మనసును సున్నితంగా తాకి, స్త్రీ అంతరంగాన్ని ప్రపంచానికి పరచయం చేయగలుగుతుంది. పురుషులు ఎంత సున్నిత మనస్కులైనా, స్త్రీల అంతర్గత ఆలోచనలనూ, భావాలనూ, జీవితం పట్ల వారి దృక్పథాన్ని అదే స్థాయిలో వ్యక్తపరచలేరు. కొన్ని విషయాలు వారికి అర్ధం కావు. అంతే.. ఉదాహరణకి ఇంట్లో తమ కోసం ఎదురు చూసే వారి గురించి ఒక పురుషుడు ఎంత గొప్పగా రాసినా "ఇల్లంటే ఒక్క ఇల్లు కాదు లోకపు ఇల్లు, గడప దాటిన ప్రాణం గడపలోకొచ్చేదాక ఎదురు చూస్తూ కొన్ని కళ్లు లాంతర్లు వెలిగించుకుని, ఆ గడపలోనే...... లాంటి వ్యక్తీకరణ ఎప్పటికీ చేయలేడు. ఇది కేవలం ఒక స్త్రీ మాత్రమే వ్యక్తీకరించే ఎదురుచూపు... ఇలా రాయడానికి ఒక స్త్రీ లా పుట్టాలి. అంతే...
"ఏ యుద్దమైనా, పోరాటమైనా ఉనికిని కాపాడుకోవడానికేగా"... అంటూ సింపుల్ గా గొప్ప విప్లవాల నుండి అంతర్గత విభేదాల వెనుక ఉన్న కారణాన్ని చెప్పారు కవయిత్రి. ‘ప్రాణం వాసన’ కవిత మనసున్న మనిషి కోసం వెతుక్కుంటున్న ప్రతీ వ్యక్తి ఆవేదన. ఇందులో పదాల కూరిక చాలా బావుంది. "ఎక్కడైనా, ఏ మూలైనా గీ వాసన ఒస్తదేమో అని దేవులాడతాన, ఎవలకేమైతే నాకేందనీ గిది జేత్తే నాకేంది గది జేత్తే నాకేందని అనుకోనోడెవడైనా దొర్కుతడా అని సుత్తాన".... అంటూ "ప్రాణమున్నప్పుడు కడగండ్లు గనబడయ్. గానీ, శవాన్నైతే సప్పుల్లతోని తీస్కబోతవ్ మరి గప్పుడు నీ గుండె సప్పుడు చెయ్యదా సాయం జెయ్యనికి" అనే ప్రశ్నతో కవిత ముగించడం వెనుక ఎంత ఆవేదన కలగలసి ఉందో కవిత రూపంలో ఇది చదివి ఫీల్ అవవలసిందే. "మానవత్వం మర్సినోల్లకాడ పీనుగ కంపు తప్ప ప్రాణం వాసన గొడ్తలేదు" అన్న ఆఖరి వాక్యాంలో ఒక నిర్వేదం ఉంది.
మారిటల్ రేప్ ని తనదైన రీతిలో ప్రస్తావిస్తూ "మరులు ఒక్కరికేనా మనసు తెలుసుకునే పనేలేదా, భరించలేని భాధనైనా పళ్ల బిగువున దాచి ప్రత్యక్ష దైవానికి ఒళ్లప్పగించే బానిసేనా ఏళ్లు గడిచినా..." అన్న ప్రశ్నలో ఒక ఆక్రోశం ఉంది...." ఎన్నింటా తానున్నా వెలుగు పోయి చీకటొచ్చేసరికి తను ఆమెగా నిలిచింది" అని స్త్రీ అస్థిత్వాన్ని ఒక వ్యక్తిగా సోధించే ప్రయత్నం చేస్తుంది.
పెద్ద వయసులో తల్లిని పట్టించుకోని సంతానం పట్ల కూడా ఆ తల్లి చూపే కరుణా, బాధ కు భాషనిస్తూ ఒక మాతృమూర్తి మనసును "నేనుండగలుగుతున్నా బిడ్డా నీ కోసం, నీ గతి కూడా ఇలాగే ఐతే మాత్రం, ఈ అమ్మ గుండె తట్టుకోలేదనేది సత్యం" అని రచయిత్రి ఆవిష్కరించిన తీరు హృద్యంగా ఉంది. మరో చోట "దివి చేరాక తెలిసింది వారసులకి దూరమైన వారి విలువ ఏమిటన్నది" అని పెద్దల తదనంతరం అనాధలైన పిల్లల పరిస్థితి గురించి రాస్తారు. రైతుల గురించి రాస్తూ.. "ఎల్లిపాయ కారమైనా ఎన్నోలే తింటడు, ఎంత బరువులైన ఎత్తి పడెస్తడు, కష్టకాలంల తోడెవ్వరు రాకున్నా అయ్యో రైతన్నని జాలి చూపకున్నా, అనునిత్యం నువ్వు తినే అన్నం ముద్దైతడు" అంటారు. అసీఫా గురించి అనుకుంటా రాసిన ఒక కవితలో "పశువుల గుణం తెలిసిన తనకు, మనుషుల గుణం తెలవదాయే" అంటూ ఆమెకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించినప్పుడు అక్కడ ఒలికిన విషాదం మనసును మెలిపెట్టింది. మరో కవితలో "ఆనాటికాలాన యుగానికో అసురుడుంటే ఈనాటి కాలాన క్షణానికో రాక్షసుడు పుడుతుంటే దిక్కుల్లు పిక్కటిల్లేలా దిగంతాలు వణికేలా గొంతెత్తి అరవాలనుంది" అంటుంది.
పుస్తకం పై ప్రేమను "మనసునూ, మెదడునూ, కళ్లనూ, నాచేతి వేళ్లనూ సమన్వయం చేస్తూ అక్షరాలతో సోపతిని చేయిస్తుంది. అదే నా ప్రియమైన పుస్తకం. అదే నా ప్రియ నేస్తం" అనీ ప్రకటించుకున్నారు. అకలి కోసం దొంగ అయినవాని కోసం "తాళలేని బాధలకు తప్పటడుగు వేసినా అమాయకుడని క్షమించదే ఈ మాయలోకం.... ప్రాణం తీసేదాక ఊరుకోదే మరి" అని బాధపడతారు. ఒంటరి పోరాటంలోని శక్తిని ప్రస్తావిస్తూ "తనలోకి తానే చొరబడి తానే అన్నీ అయి ఓ ప్రచండ శక్తి హృదయం ప్రభంజనమవుతుంది." అని రాసుకున్నారు. మరో కవితలో "ఈ లోకంలో ఏ పక్షీ, ఏ జంతువూ స్వజాతిని భక్షించదు. కానీ, మనుషులుండే భూమిపై మనుషులకే రక్షణ లేదాయే " అని వేదన పడుతారు. "బలహీన బంధాలూ, బంధుత్వాలు బహిరంగ దర్పాలే గానీ అంతర్లీనంగా మరిగి పోతుంటారు అసూయతో. పైపై మాటలకే గాని చేయూతకెవరూ రారు" అని మానవ సంబంధాలలోని నాటకీయతను ప్రస్తావిస్తారు. ద్విముఖుడు అనే కవితలో రెండు ముఖాలుండి తనను ఒంటరి చేసి పోతున్న స్నేహితుడి గురించి చెప్తూ, అతన్ని పూర్తి దోషిగా చెప్పకుండా, "కలికాల మహిమో ఎమో" అంటూ కొంత తప్పుని కాలం మీదకు తోసి, తన స్త్రీ మనసును రుచి చూపించారు. ఒక వేశ్య జీవితంలోని విషాదాన్ని చూపుతూ "ఆమె దగ్గరికొచ్చే వాళ్లది కడుపు నిండిన ఆకలైతే, ఆమె కడుపున పుట్టిన వాళ్లది నకనకలాడే పేగులాకలి" అని రాసుకున్నారు.
మరో కవితలో "చదువు సాధనం అవుతదనుకుంటే పిల్లల చావుకు కారణమవుతొంది" అని బాధపడతారు నేటి విద్యా వ్యవస్థ గురించి. నాకు బాగా నచ్చిన ఎక్స్ పెషన్ "ఆమెకు పొగరు" అనే కవిత, ఆత్మాభిమానానికి పొగరుకు తేడా తెలీక స్త్రీని పొగరుబోతుగా చిత్రించే సమాజం ప్రస్తావన ఈ కవితలో వస్తుంది. "నువ్వన్నట్లు ఆమెకు పొగరే.... అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది కదూ" అని కవిత ముగించిన తీరు బావుంది. మరో మంచి కవిత "కవిత్వపు పుటుక". "ఏంటో నేనెప్పుడు ఇంతే. కానరాని మానవత్వపు జాడలు వెదుకుతూ ఒట్టి భ్రమలోనే బ్రతుకుతూ ఉంటాను" అని తన గురించి తాను చెప్పుకున్నా, "ఉన్నన్ని రోజులేమో గానీ, ఎందుకో నే నిదురించిన నిన్నటి రాతిరి నుండి నా కీర్తి స్తుతి గానాలతో నాపై ఉన్న ప్రేమాప్యాయతానురాగాల గానాలు నా చెవులకింపైన సంగీత రసాల జలకాలాడిస్తునాయీ' అంటు మృత్యువు తో జరిగే రాజకీయాన్ని చెప్పినా, 'బుడి బుడి అడుగులంటూకున్న బురద దేహానికంతా పాకి రోగాల్తో కుమిలింది" అని బాల్య వధువు జీవితంలోని విషాదాన్ని గుర్తు చేసినా, "ఇన్ని మాటలు గుండెను గుచ్చ్లే గాని అక్కడక్కడ అక్షరాలు నీటి తడికి అల్లుకు పోయినట్లు కనబడతానై అవి. నా చిట్టితల్లికి నాపై ఉన్న ప్రేమను గుర్తు చేస్తూ, లేక లేక వచ్చిన ఈ లేఖ పై రాల్చిన కన్నీటి బొట్లనేది అర్ధమై గునపంలా గుచ్చాయి" అని బాధపడే వరకట్న బాధితురాలి తల్లి మనసును ప్రస్తావించినా, "పెరుగుట విరుగుట కొరకే అన్న సత్యం యాదుంచుకో" అని ఒ ఉపాధ్యాయురాలిగా చెప్పినా, "అనుభవాల చిట్టా అనుకుంటా అత్తరు వాసనకు బదులు నెత్తురు వాసన కొడుతోంది" అని తమ జీవిత అనుభవాలను పంచుకున్నా ఇందులో ఒక స్త్రీ జీవితం, మనసు కనిపిస్తాయి. "మనసు ద్రవించిన ప్రతీసారి నీవు వ్యక్తపరచలేని భావాలను నీకళ్లలో అశ్రుచిత్రాలుగా చూసాను" అన్నప్పుడు ఈ కవయిత్రి లో ఒక భావుకురాలు కనిపిస్తుంది. "ఎంత బాగుందో కదా ఈ ఏకాంతం నాలోని ప్రతీ పార్శ్వాన్ని సృజిస్తూ, ఆస్వాదనలో పోటీ పడుతొంది" అని ఏకాంతాన్ని ఆస్వాదించే ఒక దార్శనికురాలు కనిపిస్తారు. "వారు మా ఇంటి వారసులైతే ఇవి నా మనసుకు వారసులు అనుక్షణం అనుభూతి చెందుతున్న మానసజనులే నా అక్షరాలు" అని అక్షరాలను ప్రేమించే ఒక కవిగా మనకు అర్ధమవుతారు.
కవయిత్రి తనను "నిరంతరం అంతర్మధనం గావిస్తూ, తనలో తనను వెతుక్కునే అన్వేషిత"నని చెప్పుకున్నారు. "గా మట్టి వాసన మంచిగుంటది మనాది మొత్తం తీసేసి మనల్ని మనుష్యుల్ని చేస్తది కన్నతల్లి ఒడిలో పసిపాపనై ఒదిగినట్లుంటది" అని తన పునాదుల్ని వెతుక్కునే ప్రయత్నం చేసారు. తాను తన జీవితానుభావల ద్వారా అందుకున్న సారాన్ని, తనకు కనిపించే సమాజంలోని సంఘర్షణను ఒక స్త్రీ హృదయంతో ఆవిష్కరించే ప్రయత్నం చేసారు రచయిత్రి. అందుకే వీరి కవిత్వంలో ఒక సున్నితత్వం ఉంది, ఒక లయ ఉంది, పెద్దరికం ఉంది. చాలా కవితల్ని ఒక తల్లి స్థానంలో ఉండి రాసారు కాబట్టి ప్రేమతో నిండిన ఒక మందలింపు ఉంది. అందమైన కవితల కదంబం ఇది.
- జ్యోతి.P
Advertisement
Latest News
ప్రియాంక, మానస కు కొవ్వొత్తులతో నివాళి పెనుబల్లి రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’
.............................................................................................
ప్రియాంక రెడ్డీ, మా ..
నేడు ప్రపంచ శాంతి దినోత్సవం - khammamtv.com ................................................................
'చిరునవ్వులతో బతకాలి... చిరంజీవిలా బతకాలి...' అందరూ చిరునవ్వులతో ఉం ..
సామాజిక విప్లవకారుడు పెరియార్ - khammamtv.com ..........................................................................
భారతదేశంలో పీడిత కుల ప్రజలను సాంఘిక, ఆర్థిక, రాజకీయ అణచివేతల ..
చేపల చెరువు లూటీపై ముదిరాజుల ఆందోళన - khammamtv.com .........................................................................................................
కురవి రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’
--------------------------------------------------
..